ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పుఏపీ నెత్తిన మరో బాంబు.. !
ఇప్పటికే అర్నబ్ తుఫాన్ నష్టాల నుంచి కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ తుఫాన్‌గా మారే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. మరో ఆరు నుంచి పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 2 సాయంత్రానికి ఏపీ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరవచ్చని వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో నవంబర్ 1 నుంచి వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాయలసీమలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావం, దాని కదలికలపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.