ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీకి అగ్రస్థానం
- రూ.1.47 లక్షల కోట్ల వ్యాపారంతో రాష్ట్రంలో రెండో స్థానం
- రైతులు, మహిళలకు విస్తృత రుణ సదుపాయాలు
- మార్కాపురం పరిధిలో 50 శాఖలు.. రూ.5,300 కోట్ల వ్యాపారం
- పామూరు శాఖలో రూ.182 కోట్ల వ్యాపారం
- త్వరలో సీఆర్ఎం మిషన్.. నూతన భవనంలోకి పామూరు శాఖ
పామూరు, మేజర్ న్యూస్ :
రూ.1.47 లక్షల కోట్ల వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం పామూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శాఖను సందర్శించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు రైతులు, మహిళలకు అవసరమైన రుణ సదుపాయాలను విస్తృతంగా అందిస్తూ మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
గతేడాది మే 1 నుంచి రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడిందన్నారు. బ్యాంక్ ఏర్పడిన అనంతరం రూ.1.47 లక్షల కోట్ల వ్యాపారాన్ని సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన రుణాలతో పాటు మహిళలకు వివిధ రకాల రుణ సదుపాయాలు కల్పిస్తూ గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా తోడ్పడుతున్నామని తెలిపారు. డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లా పరిధిలోని 50 శాఖల ద్వారా రూ.5,300 కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు సామాజిక భద్రత, బీమా పథకాలను కూడా విస్తృతంగా అందిస్తున్నామన్నారు. పీఎంఎస్బీవై, ఏపీవై తదితర పథకాల ద్వారా ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పంట రుణాలను రూ.3 లక్షల వరకు నిబంధనల మేరకు అందిస్తున్నామని, డ్వాక్రా సంఘాల మహిళలకు కూడా రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
పామూరు శాఖ రూ.182 కోట్ల వ్యాపారంతో ఖాతాదారులకు సేవలందిస్తోందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆధునిక బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ముఖం, కంటి గుర్తింపు వంటి ఆధునిక సాంకేతిక విధానాల ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఖాతాదారుల సౌకర్యార్థం సీఆర్ఎం మిషన్‌ను త్వరలో పామూరులో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఖాతాదారుల ఇబ్బందులను తగ్గించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనంలోకి పామూరు శాఖను త్వరలో తరలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ.వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కడప క్లస్టర్ ఇన్చార్జి మోహన్‌బాబు, పామూరు శాఖ మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని చిల్డ్రన్స్ పార్కులో మొక్కలు నాటారు.