ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. మున్సిపాలిటీలలో త్వరలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై లెక్కింపు సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్ లకు శిక్షణ కార్యక్రమం శనివారం జరిగింది.
మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మున్సిపల్ చైర్ పర్సన్ కు, వార్డు సభ్యులకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరుగుతుందని డ్వామా పీడీ చెప్పారు. ఎన్నికల అధికారి కేటాయించిన టేబుళ్ల వద్దనే సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. క్రమశిక్షణతో మెలగాలని సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వరకు ఎన్నికల అధికారి కేటాయించిన విధుల్లోనే ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చే ఆయా పార్టీలకు చెందిన ఏజెంట్ల వివరాలు సేకరించాలన్నారు. ఎన్నికల అధికారి జారీచేసిన ధృవీకరణ పత్రాలు ఉంటేనే ముందస్తుగా లోపలకు అనుమతించాలన్నారు. గోప్యతను అనుసరించాలన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభ దశలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను రెండుగా విభజించుకోవాలని ఆమె చెప్పారు. అన్ని వార్డులకు సంబంధించిన ఓట్లను ఒక పెట్టేలో వేసి మిలితం చేయాలన్నారు. తదుపరి అర్హత ఉన్న ఓట్లు, అర్హత లేని బ్యాలెట్ పత్రాలను వేరు చేయాలన్నారు. తదుపరి మునిసిపల్ చైర్ పర్సన్ కు సంబంధించిన 25 బ్యాలెట్ పత్రాలను ఒక ఒక కట్టగా విడదీయాలన్నారు. అలా కట్టిన 40 కట్టలను ఒక్క టేబుల్ కి కేటాయించాల్సి ఉందన్నారు. ఒక టేబుల్ కి ఒక రౌండ్ లో ఒక వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించటానికి సిద్ధం చేసుకోవాలన్నారు. ఇదే పద్ధతిలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోని అన్ని టేబుల్స్ ప్రారంభం కావాలని సూచించారు. అలాగే కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన 50 ఓట్ల(బ్యాలెట్ పత్రాలు) చొప్పున లెక్కించటానికి కట్టలు కట్టాలన్నారు. లెక్కింపు ప్రక్రియపై సందేహాలు ఉంటే ముందస్తుగా శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలన్నారు. పొరపాట్లు చేయవద్దు, సమస్యలు ఉత్పన్నం గాకుండా మరింత అప్రమత్తతో విధులు నిర్వహించాలని చెప్పారు. వివిధ సందేహాలను నివృత్తి చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఇన్చార్జి అధికారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.