ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ!
హైదరాబాద్:
నగరంలో ర్యాపిడో డెలివరీ రైడర్ ఒకరు తన చేతివాటం ప్రదర్శించి విలువైన బంగారు ఆభరణాలతో పరారైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వివో (Vivo) సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, బంజారాహిల్స్ నుండి నాగోలులోని తన బంధువుల ఇంటికి ర్యాపిడో బైక్ పార్శిల్ సేవల ద్వారా రూ.62,383 విలువైన బంగారు నగలను పంపేందుకు బుకింగ్ చేసుకున్నారు. సెక్యూరిటీ గార్డు వద్ద నుండి సదరు పార్శిల్‌ను స్వీకరించిన ర్యాపిడో రైడర్, ఆ తర్వాత పెట్రోల్ ఖర్చుల పేరుతో బాధితుడి వద్ద నుండి అదనంగా మరొక రూ.100 ఫోన్‌పే ద్వారా బదిలీ చేయించుకున్నాడు.
తీరా సమయం గడుస్తున్నా నాగోలులోని బంధువుల వద్దకు పార్శిల్ చేరకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ర్యాపిడో రైడర్‌కు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, సదరు రైడర్ బాధితుడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ విషయమై ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.