సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా "రన్ ఫర్ యూనిటీ"
బాపట్ల, మేజర్‌న్యూస్ :
యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. శనివారం అక్టోబర్ 31వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "రాష్ట్రీయ ఏక్తా దివస్" (జాతీయ ఐక్యతా దినోత్సవం) కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ గారు సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో జాతీయ సమైక్యత పై స్వయంగా ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి "రన్ ఫర్ యూనిటీ" (జాతీయ సమైక్యత పరుగు) కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ పరుగులో ఎస్పీ గారితో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, భారతదేశ ఐక్యత, సమగ్రత, సమైక్యతలకు ప్రతీకగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి, 'ఉక్కు మనిషి'గా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ చరిత్రలోనే అపూర్వమైన నాయకుడని, ఆయన దూరదృష్టి, నాయకత్వ పటిమ, పట్టుదలతో స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలోని 560కి పైగా సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అఖండ భారత నిర్మాణానికి పునాది వేశారని కొనియాడారు.
దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. భారతదేశం అనేది విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ప్రజల సమాహారమని, మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నప్పటికీ, మనమంతా భారతీయులమనే భావనతో ఐక్యంగా ఉండటమే మన దేశ బలమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ ప్రత్యేకతని, ఈ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు.
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో పోలీస్ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని, సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం పోలీసుల ప్రధాన బాధ్యతలన్నారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, విధ్వంసకర చర్యలు, సామాజిక విద్వేషాలను అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందేలా, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వర్తించాలని తెలిపారు.
పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ముఖ్యంగా యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా చట్టపరిధిలో సమర్థవంతంగా ఎదుర్కొంటూ, శాంతియుతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్, బాపట్ల డీఎస్పీ సీహెచ్. చంద్రమౌళి, ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జి. నారాయణ, రూరల్ సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్, ఐటీ కోర్ ఎస్.ఐ నాగేశ్వరరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.