ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైయస్సార్సీపి
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైఎస్సార్‌సీపీ ఎందుకు ప్రయత్నించిందని ఎమ్మెల్యే ప్రశ్నించడం, అలాగే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం సరికాదని పోరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రజలకు తెలుసన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లే సమయంలో అడ్డంకులు సృష్టించడం, నామినేషన్ కేంద్రాల వద్ద దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చించివేయడం, అరెస్టులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాలను మీడియా ద్వారా ప్రజలు గమనించారని తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తన పేరును మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందుగానే ప్రకటించారని వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జనరల్ కేటగిరీకి కేటాయిస్తే తనను, బీసీకి కేటాయిస్తే బీసీ నాయకుల్లో ఒకరిని, జనరల్ మహిళకు కేటాయిస్తే రాచమల్లు రమాదేవిని వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి నిలపాలని ముందుగానే నిర్ణయించినట్లు వివరించారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రొద్దుటూరులో చోటుచేసుకున్న పరిణామాలు, టీడీపీ నాయకుల వ్యవహారశైలి ప్రజలకు తెలుసని అన్నారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి గతంలో కామనూరు పరిధిలో ఉన్న ఓటును జూన్ 26న నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ప్రొద్దుటూరుకు మార్చుకున్నారని ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఓటరు జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందారని తెలిపారు. అయితే సంబంధిత న్యాయస్థాన ఉత్తర్వుల రాతపూర్వక ప్రతులను అధికారులు చూపించలేదని పోరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలు సాధించామని టీడీపీ సంబరాలు చేసుకోవడం ప్రజాస్వామ్య ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో ఎన్నికైనప్పుడే ప్రజాప్రతినిధులకు నిజమైన ప్రజా నాయకులుగా గుర్తింపు లభిస్తుందని పోరెడ్డి నరసింహారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతాప్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా