అమరవీరుల వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ
శ్రీకాకుళం (ఎచ్చెర్ల), సూర్య : అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కళ్యాణ మండపంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసు శాఖ నిత్యం విధి నిర్వహణలో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, ఆయుధ సామగ్రి, భద్రతా పరికరాలను ప్రదర్శించగా విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. వాటి వినియోగం, పనితీరుపై ఆర్ ఐ ఎస్ శంకర్ ప్రసాద్,పోలీసు సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు జాతీయ సమైక్యత, సమగ్రత, ఐకమత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.