BREAKING
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ  బి.ఉమామహేశ్వర్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

బాపట్ల జిల్లాలోని చీరాల, రేపల్లె మున్సిపాలిటీలలో నవంబర్ 1వ తేదీన జరగనున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి శనివారం చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో బ్రీఫింగ్ నిర్వహించి, ఎన్నికల విధుల నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 700 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. వీరిలో నలుగురు డీఎస్పీలు, తొమ్మిది మంది సీఐలు, 33 మంది ఎస్‌ఐలు ఉన్నారని, అదనపు బలగాలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. చీరాల పరిధిలో 430 మంది, రేపల్లె పరిధిలో 265 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారని తెలిపారు.

జిల్లాలో మొత్తం 10 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వీటిలో చీరాల పరిధిలో ఏడు, రేపల్లె పరిధిలో మూడు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 26 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వీటిలో చీరాల పరిధిలో 18, రేపల్లె పరిధిలో ఎనిమిది ఉన్నాయన్నారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు.

పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 19 రూట్ మొబైల్స్, 8 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, ఐదు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, చెక్‌పోస్టుల ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది సంబంధిత రూట్ ఆఫీసర్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో సున్నంతో గుర్తులు ఏర్పాటు చేయించాలని, ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఓటర్లు అక్కడ గుమిగూడకుండా చూడాలన్నారు. సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎక్కడా గుంపులుగా ప్రజలు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు క్రమపద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బారికేడింగ్, క్యూలైన్ల ఏర్పాటును పర్యవేక్షించాలన్నారు.

ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేకుండా ఎవరూ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదని, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతించాలని ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్ సామగ్రికి ఎస్కార్ట్‌గా వెళ్లే సిబ్బంది, పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చే వరకు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి అశ్రద్ధ కూడా అవాంఛనీయ ఘటనలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.

జిల్లా ఎస్పీ గారు విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో గత రాత్రి నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశామన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో ఉండరాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చీరాల, రేపల్లె మున్సిపాలిటీల పరిధిలోని హోటళ్లు, రిసార్టులు, అతిథి గృహాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండరాదని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.

ఎన్నికల విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన 'సమర్థ్' (SAMARTH) మొబైల్ యాప్‌ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను ఇప్పటికే యాప్‌లో పొందుపరిచామని, గూగుల్ మ్యాప్స్ సాంకేతికతను కూడా అనుసంధానం చేశామన్నారు. ఏదైనా ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి తలెత్తినప్పుడు, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి లేదా సిబ్బంది యాప్‌లోని SOS బటన్‌ను నొక్కితే, వెంటనే ఆ సమాచారం సమీపంలోని పోలీస్ సిబ్బందికి, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుందన్నారు. తద్వారా సమీపంలోని పోలీస్ బలగాలు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశామని, నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే లేదా భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో ప్రత్యేక భద్రత కల్పిస్తామని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. నిరంతర పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుందన్నారు.

గత ఎన్నికల్లో నేర చరిత్ర కలిగి ఉండి, ప్రస్తుత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 2,646 మందిపై ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేశామన్నారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ గారు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా లేదా భయభ్రాంతులకు గురిచేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా బాపట్ల జిల్లా పోలీస్ ఎలక్షన్ సెల్ కంట్రోల్ రూమ్ నంబర్ 8333813228కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్, చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్,  ఎన్నికల విధులు నిర్వహించేందుకు విచ్చేసిన ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.