నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న 'మాక్ అసెంబ్లీ' కార్యక్రమానికి సంబంధించి అద్దంకి మండల స్థాయి పోటీలు స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. గురుకుల పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు తేజస్విని, జ్ఞాన కీర్తిక, బాయ్స్ హై స్కూల్ కు చెందిన సుశాంత్ కుమార్ లు ఎంపికయ్యారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులు నవంబర్ మూడవ తేదీ నియోజకవర్గస్థాయిలో జరగనున్న పోటీలలో పాల్గొంటారని డిప్యూటీ డిఇఓ గంగాధర్ రావు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.