జోరుగా ఎన్నికల ప్రచారంలో స్వరూప్ రెడ్డి * సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన *
సంతబొమ్మాళి, సూర్య : నౌపడ ఎంపీటీసీ-1 అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తూ తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తుండటంతో నౌపడ పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ సందర్భంగా స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ యువ నాయకుడిగా, టీడీపీ మండల అధ్యక్షుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగానన్నారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే నౌపడ పంచాయతీతో పాటు సంతబొమ్మాళి మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఎంపీటీసీగా గెలిచి, భవిష్యత్తులో ఎంపీపీగా మండల అభివృద్ధికి మరింత బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను నౌపడ ఎంపీటీసీ-1గా, జడ్పీటీసీ అభ్యర్థి పుకళ్ల పద్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణుల సమష్టి కృషితో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దండు గోపాలపురం తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థిని బెండి సంజీవమ్మ అరుణ్ , సంతబొమ్మాళి-1 తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి యువ నాయకుడు కూచెట్టి భానుప్రకాష్ ప్రచారంలో జోరు పెంచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.