చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లాలోని చీరాల, రేపల్లె మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు.
ఆదివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాల సందర్శనలో భాగంగా చీరాల పట్టణంలోని ఒకటో వార్డు రామ్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌ను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీరాల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రజలకు, విధులు నిర్వహించిన అధికారులకు, ముఖ్యంగా పోలీసు యంత్రాంగానికి, పాత్రికేయులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
పోలింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో గుంపులుగా ఉండటం, ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే తదితర ఫిర్యాదులు కంట్రోల్ రూమ్‌కు అందాయని తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత రూట్, జోనల్ అధికారులతో సమన్వయం చేసుకుని ఫిర్యాదులను పరిష్కరించినట్లు వివరించారు. పోలింగ్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
చీరాలలో 50,558 మంది ఓటు వినియోగం
చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 88 పోలింగ్ కేంద్రాల్లో 72.69 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 69,557 మంది ఓటర్లకు గాను 50,558 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 24,247 మంది, మహిళలు 26,311 మంది ఉన్నారు.
రేపల్లెలో 25,776 మంది ఓటు వినియోగం
రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 44 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 69.65 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 37,008 మంది ఓటర్లకు గాను 25,776 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
చీరాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో, రేపల్లె మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో నవంబర్ 3న నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంగణాల్లోనే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ సమావేశంలో చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి నరసింహా రావు,మున్సిపల్ కమిషనర్ కె.డానియేలు జోసఫ్,తహశీల్దార్ గోపి కృష్ణ తదితరులు ఉన్నారు.