శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపు
దుర్గం చెరువు ఎస్టీపీ, గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎండీ
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని తాగునీటి యేతర అవసరాలకు విస్తృతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం దుర్గం చెరువు ఎస్టీపీని సందర్శించిన ఆయన శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యతతో పాటు గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ కార్యకలాపాలను పరిశీలించారు. ట్యాంకర్ల ఫిల్లింగ్, సరఫరా, నిర్వహణ తీరును సమీక్షించారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచి, శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
నిర్మాణ పనులకు గ్రీన్ వాటర్ వినియోగించాలి:
అనంతరం జలమండలి అధికారులు, మైండ్‌స్పేస్, రహేజా గ్రూప్ ప్రతినిధులతో ఎండీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల నిర్మాణ పనులు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర తాగేతర అవసరాలకు మంచినీటికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచించారు. ఇందుకు అవసరమైన గ్రీన్ వాటర్ సరఫరా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 51లోని జలమండలి జలసంరక్షణ థీమ్ పార్కు గార్డెనింగ్ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి ఎస్టీపీ వద్ద నీటి నాణ్యత డిస్‌ప్లే బోర్డులు:
జలమండలి ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఎండీ ఆదేశించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన వర్తించే ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి జరుగుతోందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఎస్టీపీ వద్ద ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి, బీఓడీ , సీఓడీ , టీఎస్ఎస్ పీహెచ్ వంటి కీలక పారామీటర్ల వాస్తవ విలువలతో పాటు నిర్దేశిత ప్రమాణాలను ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సూచించారు. తద్వారా వినియోగదారుల్లో నీటి నాణ్యతపై నమ్మకాన్ని పెంపొందించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి సైబరాబాద్ రీజియన్ ఈడి సంతోష్, సీజియం పద్మజతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.