రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి
సూర్య ప్రాంతీయ డెస్క్: ఉద్యోగులు విరమణ పొందే నాడే వారికి చెందాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు మరియు బెనిఫిట్లను చెల్లించి ఘనంగా వీడ్కోలు పలకాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మున్నూరు కాపు రాజ్యాధికారం పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఏటిగడ్డ శ్రీనివాసులు పటేల్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని చేయూత వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పదవీ విరమణ పొందిన తరవాత కూడా నెలలు, సంవత్సరాల తరబడి బెనిఫిట్ల చెల్లింపుల్లో ప్రభుత్వాలు తాత్సారం చేయడం తీవ్ర విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే పెండింగ్‌లో ఉన్న డీఏలు మంజూరు చేస్తామని, సీపీఎస్ రద్దుతో పాటు కొత్త పిఆర్‌సిని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కనీసం పిఆర్‌సి నివేదికను కూడా బయటపెట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలన సాగిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం అంటే ఉద్యోగులు, ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం అన్న ప్రాథమిక సూత్రాన్ని ప్రస్తుత పాలకు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
గత చరిత్రను పరిశీలిస్తే ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని మరియు వారితో విరోధం పెంచుకున్న ఏ ప్రభుత్వమూ మళ్లీ అధికారంలోకి రాలేకపోయిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి పెండింగ్‌లో ఉన్న డీఏలు, పిఆర్‌సి నివేదిక ఆధారంగా జీతాల పెంపును వెంటనే ప్రకటించాలని కోరారు. పదవీ విరమణ రోజే ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు.