సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
జహీరాబాద్;జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సిద్దేశ్వరాలయంలో జంగమ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష బిల్వార్చన, అయ్యాచార దీక్షల మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉజ్జయిని జగద్గురు రథోత్సవ ఊరేగింపు రాచన్న స్వామి ఆలయం నుంచి సిద్దేశ్వరాలయం వరకు కొనసాగింది. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య రథోత్సవం నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, పాదపూజ కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. జంగమ సమాజ ప్రతినిధులు, భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.ఈ సందర్భంగా ఉజ్జయిని పీఠాధిపతి భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ఆశీర్వాచనం అందించారు. ధార్మిక కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. అయ్యాచార దీక్షలు స్వీకరించిన వారికి ఆశీర్వచనాలు అందజేశారు. వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు సోమలింగ శివాచార్య, వీరేశ్వర శివాచార్య, శివయోగి శివాచార్య, వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, రాచయ్య స్వామి, సిద్ధయ్య స్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.జంగమ సమాజ ప్రతినిధులు,తాలూకా అధ్యక్షులు మల్చల్మా శ్రీనివాస్ స్వామి, పట్టణ అధ్యక్షులు మఠం శివ కుమార్, చంద్ర శేఖర్, బస్వరాజ్, శరణయ్య, ఉమాపతి, సంగమేశ్వర్ స్వామి, రాజకుమార్, రాజు( బిఎస్ఎన్ఎల్), బస్వరాజ్, చెన్నయ్య స్వామి, మల్లికార్జున్ స్వామి, శివకుమార్, శశిధర్ స్వామి, నరేష్ స్వామి, మహారుద్రయ్య స్వామి అయ్యాచార దీక్షలు స్వీకరించిన భక్తులు, వివిధ ప్రాంతాలు కర్ణాటక లోని హుమ్నబాద్, బీదర్, కల్బుర్గి,చించొళి తో పాటు హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, వికారాబాద్, తాండూర్,నారాయణ ఖేడ్, అందోల్ -జోగిపేట నుంచి వచ్చిన శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.