telangana
ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు
సూర్య, తిమ్మాపూర్ తిమ్మాపూర్ మండల కేంద్రంలో పోలీసుల నిఘాకే సవాల్ విసురుతూ గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రామకృష్ణ కాలనీకి చెందిన చెంచు లక్ష్మి తన భర్తతో కలిసి శ్రీ చైతన్య పాఠశాలలోని కుమారుడిని చూసి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా, తిమ్మాపూర్ శివారులో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కున్నారు. పెనుగులాటలో తాడు తెగిపోవడంతో అందులోని సుమారు అర్ధ తులం బంగారు పుస్తెలను దుండగులు అపహరించి వేగంగా పరారయ్యారు. ఏకంగా ఎల్ఎమ్‌డీ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే, నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై ఈ చోరీ జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న ఎల్ఎండి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా, సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. రాజీవ్ రహదారిపై రాత్రి వేళల్లో పోలీసుల నిఘా, పెట్రోలింగ్‌ను పెంచి దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.