telangana
ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ
సూర్య జగిత్యాల ప్రతినిధి ;;వాతావరణ మార్పులు.. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు..భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి..
సాగునీరు, తాగునీటి అవసరాలు.. వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లు..విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలు..వీటన్నింటినీ ముందుగానే అంచనా వేసి భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా జగిత్యాల జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రకృతి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుతూ, రానున్న యాసంగి సీజన్లో రైతులకు నష్టం వాటిల్లకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టగా, జగిత్యాల జిల్లాలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి సంరక్షణ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు వివిధ శాఖలను సమన్వయం చేస్తూ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. వర్షపు ప్రతి చుక్కను ఒడిసిపట్టడం, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థంగా వినియోగించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, తాగునీటి భద్రతకు ముందస్తు ఏర్పాట్లు చేయడం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించడం, ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో శాశ్వత నీటి సంరక్షణ ఆస్తులను సృష్టించడం.. ఈ ప్రధాన లక్ష్యాలతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. జిల్లాలో ప్రస్తుత వర్షపాతం పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పటివరకు 815.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 896.7 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. ఇప్పటివరకు 51 వర్షపు రోజులు నమోదయ్యాయి. మొత్తం మీద జిల్లాలో వర్షపాతం పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ భీమారం, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో వర్షపాతం లోటు నమోదైందని అధికారులు చెప్పారు .జిల్లా నీటి భద్రతలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 36 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఈ నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి విడుదల, తాగునీటి అవసరాలు, భవిష్యత్తు వినియోగంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.కాకతీయ ప్రధాన కాలువ ద్వారా అక్టోబర్ 10 నుంచి సుమారు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, దీని ద్వారా 18 మండలాలకు సాగునీరు అందుతోంది. జిల్లాలోని నీటి వనరుల పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 920 చెరువుల్లో 572 చెరువులు 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ నీటి నిల్వను కలిగి ఉన్నాయి. ఇది మొత్తం చెరువుల్లో 63 శాతం.మరో ఆరు చెరువుల్లో పూర్తి సామర్థ్యానికి మించి నీరు ఉండగా, 148 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి.ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి అవసరాలు అధికమయ్యే పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో విద్యుత్ వినియోగ గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. 2025 సెప్టెంబర్‌తో పోలిస్తే 2026 సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం 33.32 శాతం పెరిగి 119.96 మిలియన్ యూనిట్లకు చేరింది. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు 80.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 61.89 శాతం అధికం.నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా ఉద్యాన శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.ప్రస్తుతం జిల్లాలో 37,517 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, 10,200 ఎకరాల్లో పసుపు, 1,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 85,974 బోర్‌వెల్స్ ఉండగా, వీటిలో 62 శాతం బోర్లు పనిచేస్తున్నాయి. 34 శాతం బోర్లలో నీటి దిగుబడి తక్కువగా ఉండగా, మరో 4 శాతం బోర్లు ఎండిపోయినట్లు అంచనా వేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బోర్వెల్ రీచార్జి, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.మంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నీటి సంరక్షణ పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి నిర్మాణాలు, మ్యాజిక్ సోక్పిట్లు, కమ్యూనిటీ సోక్పిట్లు, డ్రెయిన్ ఎండ్ సోక్పిట్లు, కాంటూరు కందకాలు, స్టోన్ ట్రెంచెస్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. భవనాల పైకప్పులపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా ఇంకుడు గుంతలకు మళ్లించడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు అవకాశం ఉంటుంది. కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఉపాధి హామీ పనుల పురోగతిని పరిశీలిస్తూ ప్రతి గ్రామంలో రోజుకు సగటున 60 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అక్టోబర్ 30న నిర్వహించిన సమీక్షలో వచ్చే జూన్–జూలై వరకు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిరంతరంగా కొనసాగించేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు ప్రజలకు చేరినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై ఆట, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వి. శ్రీధర్ తెలంగాణ సాంస్కృతిక సారథి బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాల్లో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై పలు సూచనలు అందించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేస్తూ, ప్రజల భాగస్వామ్యంతో జగిత్యాల జిల్లా యంత్రాంగం సమగ్ర ముందస్తు కార్యాచరణను అమలు చేస్తోంది.