telangana
భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
సూర్య,వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, స్వామివారల కల్యాణం, చండీ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములతో పాటు గండ దీపంలో నూనె పోసి తమ మొక్కుబడులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు.
*సౌకర్యాలను పరిశీలించిన ఈవో:*
ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ (ఈవో) రమాదేవి స్వయంగా ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షించారు. ఉచిత దర్శనం లైన్లు, శ్రీ ప్రదక్షిణ మార్గం మరియు కోడెలు కట్టే ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దర్శనానికి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలు మరియు సాధారణ భక్తులతో స్వయంగా మాట్లాడి, దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయో, వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ భద్రతపై ఎస్పీఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.