బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
పరిగి, మేజర్ న్యూస్:మండల సర్వసభ్య సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులను కించపరిచే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వైఖరిని కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హెచ్చరించారు. పరిగి నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే బీఆర్ఎస్ సర్పంచుల పట్ల వివక్ష చూపుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఆదివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ సర్పంచులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయం కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఎన్నికల అనంతరం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరికీ సహకరిస్తూ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు సహకరించానని గుర్తుచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్పంచులను లక్ష్యంగా చేసుకుని నిధులు కేటాయించకుండా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగించడం బాధాకరమన్నారు.ఇందిరమ్మ కమిటీలకు గ్రామ సర్పంచులే చైర్మన్లుగా ఉంటారని, అయినప్పటికీ బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో వారికి సమాచారం ఇవ్వకుండానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడమేనన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మాత్రం ప్రజల పక్షాన పనిచేయాలని, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, మిషన్ భగీరథ నీరు మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే వస్తోందని ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు ధరలు, సరఫరాపై ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం యూనిట్‌కు రూ.3.90 చొప్పున విద్యుత్ సరఫరాకు ఒప్పందం చేసుకుందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రూ.15 ఖర్చు చేసినా విద్యుత్ అందుబాటులో లేదని చెప్పడం పాలన తీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పాలనలో పరిగి నియోజకవర్గం నుంచి ఉపాధి కోసం మళ్లీ వలసలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో పెండింగ్‌లో ఉన్న మూడు విడతల రైతుబంధు నిధులతో పాటు ప్రస్తుత విడత నిధులు కలిపి మొత్తం నాలుగు విడతల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కుకు అర్హులైన వారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు చేసుకోని వారు బీఆర్ఎస్ నాయకులను సంప్రదిస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో దోమ మండల మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, మాజీ నార్మల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిని రాములు, పరిగి మండల అధ్యక్షుడు మాణిక్యం, మాజీ ఎంపీపీ అరవిందరావు, పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, కుమార్, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, బుత్కూరి రవి, కుర్వ నరేష్ యాదవ్, బుద్దుల శ్రావణ్ రెడ్డి, శశాంక్ రెడ్డి, మీర్ తాహిర్ అలీ, పరిగి మండల మాజీ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.