అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు
సూర్య, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) వాలీబాల్ ఎంపిక పోటీలు శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఈ ఎంపిక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి లక్షెట్టిపేట మండల విద్యాధికారి, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. శైలజ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి నరసన్న, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, వైస్ చైర్‌పర్సన్ రాజేశ్వరి వెంకటస్వామి, 13వ వార్డు కౌన్సిలర్ బిరుదు సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం.డి. యాకూబ్ పాల్గొన్నారు.
ఈ ఎంపిక పోటీల్లో అండర్-14, అండర్-17 బాలికల విభాగాలతో పాటు అండర్-14 బాలుర విభాగంలో సుమారు 200 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు బరిలోకి దిగారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 30 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కూడా పోటీల నిర్వహణలో పాల్గొన్నారు.
క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు భోజన వసతిని ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను జిల్లా తరఫున తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
క్రీడా ఎంపిక పోటీల నిర్వహణ కార్యదర్శి, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల లక్షెట్టిపేట వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు కె. రామ్మోహన్‌రావు ఈ వివరాలను వెల్లడించారు.