షారూఖ్ ఖాన్ కింగ్ మూవీ ఓవర్సీస్ హక్కులు రికార్డు ధర... రూ. 175 కోట్లకు భారీ ఒప్పందం!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా 'కింగ్' మరో సరికొత్త రికార్డును తన పేరున లిఖించుకుంది. ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ (విదేశీ) థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 175 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. సౌత్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తున్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్‌లో షారూఖ్ ఖాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ రికార్డు ఒప్పందం మరోసారి నిరూపించింది. ఫర్స్ ఫిలిమ్స్ సంస్థ ఈ విదేశీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం.
గతంలో షారూఖ్ ఖాన్ నటించిన సంచలన విజయాలు సాధించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాల ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్వహించింది. అయితే తాజాగా 'కింగ్' సినిమా విషయానికి వచ్చేసరికి ప్రఖ్యాత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫర్స్ ఫిలిమ్స్ రంగంలోకి దిగి రూ. 175 కోట్ల మేర కనిష్ట హామీ (ఎంజీ) మొత్తాన్ని చెల్లించి ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుంది. ఇంత భారీ మొత్తానికి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ భారీ ఒప్పందం ప్రకారం చూస్తే, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే 'కింగ్' సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. సాధారణంగా ఓవర్సీస్ వసూళ్లలో సగం భాగం మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకు దక్కుతుంది. ఈ లెక్కన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే విదేశాల్లో సుమారు రూ. 350 కోట్ల నుంచి రూ. 375 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. షారూఖ్ గత చిత్రాలైన పఠాన్, జవాన్ సినిమాలు విదేశీ మార్కెట్‌లో రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసిన ఘనతను కలిగి ఉండటంతో, ఈ టార్గెట్ సాధించడం అసాధ్యం కాకపోయినా భారీ వసూళ్ల ఒత్తిడి మాత్రం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి మొదటిసారి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ థియేట్రికఫల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరి ఈ భారీ బిజినెస్ అంచనాలను 'కింగ్' ఏ విధంగా అందుకుంటుందో చూడాలి.