ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ :-
పాలమూరు యూనివర్సిటీ యూనివర్సిటీ పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో శుక్రవారం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు విద్యార్థులకు డిగ్రీతో పాటు పీజీ విద్యను ఒకే కోర్సులో అభ్యసించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ప్రాథమిక కెమిస్ట్రీ పరిజ్ఞానం నుంచి ఆధునిక పరిశోధనల వరకు సమగ్ర అవగాహన పొందేందుకు ఈ కోర్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రారంభం నుంచే పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రయోగశాలల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కెమిస్ట్రీ రంగం ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, పర్యావరణం, వ్యవసాయం వంటి అనేక రంగాలతో అనుసంధానమై ఉందని వివరించారు. ఉన్నత విద్య, పీహెచ్‌డీ, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థల్లో అవకాశాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తొలిసారిగా DOST ప్రవేశాల ప్రక్రియలో ఈ కోర్సును చేర్చడం ద్వారా మొత్తం 40 సీట్లకు 100 శాతం ప్రవేశాలు సాధించడం పాలమూరు యూనివర్సిటీకి గర్వకారణమని పేర్కొన్నారు.అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, నిరంతర అధ్యయనంతో అకడమిక్ ఎక్సలెన్స్ సాధించాలని, ప్రయోగాలు, సెమినార్లు, పరిశోధనా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా, ప్రయోగశాల సదుపాయాలను సద్వినియోగం చేసుకొని అధ్యాపకుల మార్గదర్శకత్వంలో తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంపు లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కంట్రోల్లర్ అఫ్ ఎగ్జామినేషన్ డా కే. ప్రవీణ,విభాగాధిపతి డాక్టర్ ఎస్. విజయలక్ష్మి, కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రవికుమార్, అధ్యాపకులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ అయేషా హస్మి, డాక్టర్ సిద్ధరామ గౌడ్,డా ఎం. స్వాతి,డా రవీందర్ గౌడ్, డా రామరాజు బోధనేతర సిబ్బంది రాఘవేంద్ర, సత్యం, యాదయ్య, గాయత్రి, కౌసల్య, శివలీల, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ .పాలమూరు యూనివర్సిటీ,మహబూబ్ నగర్.