మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు!
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: మిర్యాలగూడ ప్రాంతంలో ధాన్యం విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎండకు, వానకు తడుస్తూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ధాన్యం ధరలను మిల్లర్లు ఇష్టానుసారంగా తగ్గిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితం వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.4,500 వరకు ధర పలకగా, ప్రస్తుతం ఒక్కసారిగా రూ.1,000 తగ్గించి ధర నిర్ణయించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.3,500కే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర్నా చేస్తేనే రూ.3,800కు అంగీకారం!
తాజాగా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లోని సాంబశివ రైస్ మిల్ వద్ద రైతులు భారీ ధర్నా నిర్వహించడం మిల్లుల వద్ద నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ధాన్యం ధరను ఒక్కసారిగా తగ్గించడంతో పాటు, కొనుగోళ్లలో జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటూ స్థానిక రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో చివరకు మిల్లు యాజమాన్యం క్వింటాల్‌కు రూ.3,800 చెల్లించేందుకు అంగీకరించడంతో రైతులు ధర్నా విరమించారు.
జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
రైతుల ఆందోళనతో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి మిల్లు యాజమాన్యంతో చర్చలు జరిపారు. అనంతరం ధర విషయంలో అంగీకారం కుదరడంతో ఆందోళన సద్దుమణిగింది.
అకాల వర్షాలు.. ఆపై మిల్లర్ల ఇబ్బందులు!
ఇప్పటికే అకాల గాలివానల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు మిల్లుల వద్దకు తీసుకొస్తే అక్కడ కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. రవాణా ఖర్చులు, ధాన్యం ఆరబెట్టే ఇబ్బందులు, వాతావరణ ప్రతికూలతలతో సతమతమవుతున్న తమపై ధరల తగ్గింపు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల తగ్గింపుపై అధికారుల పర్యవేక్షణ ఏదీ?
పది రోజుల వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.3,500కు ధర తగ్గడం వెనుక కారణాలేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్లంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలను నియంత్రిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ జరపాలని కోరుతున్నారు. ఒక మిల్లు వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తేనే ధర పెంచేందుకు అంగీకరిస్తే, మిగతా మిల్లుల వద్ద ధాన్యం విక్రయిస్తున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైస్ మిల్లుల వద్ద కొనుగోళ్లను పర్యవేక్షించాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.