బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల పరిశీలనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పరిశీలకుడు డాక్టర్ శ్యామ్ జాన్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్‌తో కలిసి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, జాతీయ టీకాల కార్యక్రమం, చిన్నారులకు వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణ, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమణ వ్యాధుల గుర్తింపు, చికిత్స, కీటక జనిత వ్యాధులు, ఐడీఎస్పీ (ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) అమలును సమీక్షించారు.
అలాగే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులు, ముఖ్యంగా కుక్కకాటు, పాముకాటు చికిత్సకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, అత్యవసర వైద్య సేవలను పరిశీలించారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల వివరాల నమోదు, రికార్డులు, నివేదికలను తనిఖీ చేశారు.
తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, చిన్నారులకు టీకాల పంపిణీ, ప్రతి బుధ, శనివారాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, అత్యవసర పరిస్థితుల్లో కుక్కకాటు, పాముకాటు చికిత్స, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల లభ్యతను పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో చేపడుతున్న ముందస్తు చర్యలు, రోజువారీ రికార్డుల నిర్వహణ, రోగుల వివరాల నమోదు, వ్యాధుల వ్యాప్తి సమయంలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై డాక్టర్ శ్యామ్ జాన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వనిత, డాక్టర్ శ్రీధర్ బాబు, జిల్లా వైద్య బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, ఆర్.ఎస్. పద్మ, సుమన్, రషీద్, శ్రీనివాస్ తదితర వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.