ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీ సేవా, ఆధార్‌తో పాటు వివిధ రకాల ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఆధార్ నూతన నమోదు, వివరాల అప్‌డేట్ సేవలను కూడా డోర్‌స్టెప్ విధానంలో అందుబాటులోకి తీసుకువస్తోంది.
మీ సేవా డోర్‌స్టెప్ సేవలకు ప్రారంభ నెలలోనే ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సేవలు కావాల్సిన వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి లేదా మీ సేవా పోర్టల్ ద్వారా తమకు కావలసిన సేవలను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు 3,885 కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా ఈ నూతన విధానం ఎంతగానో ఉపయోగపడనుంది.
ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రాంతాల్లో ఈ డోర్‌స్టెప్ సేవలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుక్ చేసుకున్న సేవల స్వభావాన్ని బట్టి నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో డిజిటల్, పౌర సేవలను మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పులను వేగవంతం చేస్తోంది.