పర్చూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించాలని, ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ పసుపు జెండా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘చెప్పాం చేస్తున్నాం’ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ఏలూరి ముచ్చటిస్తూ పార్టీ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఓట్ల రూపంలో మలచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని ఏలూరి స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం సాధ్యమని పేర్కొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.