ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః గ్రేటర్ జర్నలిస్టులకు ఇళ్ళస్థలాల కేటాయింపులో కొనసాగుతున్న ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో జర్నలిస్టుల మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలియజేస్తారని వారు పేర్కొన్నారు. ఇళ్ళస్థలాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ నిరాశ - నిస్పృహలకు లోనైన గ్రేటర్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాస స్థలాలు, గృహ వసతి కల్పించే ఉద్దేశ్యంతో 2008 లో "గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ"(రి.నెం. 163/2008) ఏర్పాటు చేయడం జరిగిందని, దాదాపు 1300 మంది సొసైటీ సభ్యులైన జర్నలిస్టులు గత 18 ఏళ్ళుగా ఇళ్ళస్థలాల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ జిల్లాతో సహా జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ మున్సిపాలిటీలలో నివసిస్తూ వివిధ పత్రికలు, టీవీ చానళ్ళలో పని చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ళస్థలాలు కేటాయించకుండా ఉత్తుత్తి హామీలతో కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టులకు కనీస సదుపాయాలు లభించడంలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ఐదు అంశాలను మేనిఫెస్టో లో పెట్టి అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ళస్థలాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల చిట్ చాట్ మాటలు, ఉత్తుత్తి హామీలే తప్ప ఆచరణలో ఏమీ చేయడంలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత్రికేయులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ళస్థలాల సమస్య పై ఈనెల 20న జరిగే జర్నలిస్టుల మహాధర్నాతోనైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని గ్రేటర్ జర్నలిస్టులకు ప్రత్యేక జీవో ద్వారా ఇళ్ళస్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.