విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిని బేసిక్ ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థినులతో మంత్రి నేరుగా మాట్లాడి వారికి ప్రతిరోజూ నాణ్యమైన భోజనం, అల్పాహారం అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన తర్వాత తమకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థినులు సాధించిన మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని అన్నారు. క్రీడల్లో ఇప్పటికే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారు సాధించే విజయాలు కుటుంబానికి, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య, మంచి వసతులు ఎంతో కీలకం. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.