హెచ్ఎండీఏ నిధులపై ఎమ్మెల్యే యాదయ్య, సర్పంచ్ కొండల్ యాదవ్ మధ్య వాగ్వాదం
నవాబుపేట, మేజర్ న్యూస్: నవాబుపేట మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. హెచ్ఎండీఏ నిధుల కేటాయింపు, గ్రామాల అభివృద్ధి పనుల అంశంపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎల్లకొండ గ్రామ సర్పంచ్ కొండల్ యాదవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గ్రామాల అభివృద్ధి, నిధుల వినియోగంపై జరిగిన చర్చ కాస్తా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదానికి దారితీసింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. "మీరు గ్రామ సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకుంటే నాకేంటి.. నేను ఎమ్మెల్యేను" అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సర్పంచ్ కొండల్ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే స్పందిస్తూ "నేను చెప్పింది వింటే అభివృద్ధి పథకాలు అందుతాయి" అని పేర్కొన్నారు. దీంతో సమావేశంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించే హెచ్ఎండీఏ నిధులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమావేశంలో జరిగిన ఈ వాగ్వాదం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు, గ్రామాల అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన సమావేశంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.