గిన్నిస్ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర
ఒరిగామి, పేపర్ ఆర్ట్‌లో అసాధారణ ప్రతిభ.. భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ 31గిన్నిస్ ప్రపంచ రికార్డుల తో అరుదైన ఘనత సాధించారు. 2016–2020 బ్యాచ్‌కు చెందిన ఆమె, ఇటీవల తన తల్లిదండ్రులు కవితా, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి చేతితో తయారు చేసిన 3,000 కాగితపు బొమ్మల అతిపెద్ద ప్రదర్శనకు సంబంధించి మరో గిన్నిస్ రికార్డును అందుకున్నారు.
ఒరిగామి, పేపర్ ఆర్ట్‌లో ప్రతిభ కనబరుస్తున్న శివాలి.. తన తల్లిదండ్రుల సహకారంతో కాగితపు కళాఖండాలను రూపొందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. సృజనాత్మకత, పట్టుదల, అంకితభావంతో ఆమె సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఈ ఘనతపై గీతం విశ్వవిద్యాలయ నాయకత్వం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శివాలి, ఆమె కుటుంబానికి అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.