telangana
ఘనంగా జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలు
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ అదనపు కలెక్టర్ వి. విక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి ఆయన అందించిన విశేష కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశంలో విద్యావ్యాప్తికి, సమాన అవకాశాల కల్పనకు ఆయన వేసిన పునాదులు నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని సూచించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా, జాతీయ మైనారిటీ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ అధికారులు, సిబ్బంది ప్రజలకు నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శశి కుమార్, టి జి ఓ సెక్రటరీ సాయి రెడ్డి ఉర్దూ అధికారి అర్షద్ అలీ, జూనియర్ అసిస్టెంట్లు సాయిలు, సత్యం, డీఈఓలు ఇర్ఫాన్, ఇక్రమ్, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.