ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. పశుగ్రాసం పెంపుపై రైతులు దృష్టి సారించాలి: ఎంపీడీవో సంపత్
బషీరాబాద్, మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి కొరత, పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బషీరాబాద్ ఎంపీడీవో సంపత్ పిలుపునిచ్చారు. బోరుబావులు ఉన్న రైతులు పశువులకు దాణా కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక చొరవ తీసుకొని పచ్చి మేత సాగు చేపట్టాలని సూచించారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం బషీరాబాద్ మండల కేంద్రంలో నీటి, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ఎంపీడీవో సంపత్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా వృథాగా నీరు కారుతున్న కుళాయిలకు అధికారులు స్వయంగా మూతలు బిగించి నీటి పొదుపుపై ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.అనంతరం ఎంపీడీవో సంపత్ మాట్లాడుతూ… ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నీటిని, విద్యుత్‌ను అవసరానికి మాత్రమే వినియోగించాలని కోరారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎస్. వెంకటేష్ మహారాజ్, ఎంఈఓ దోస రాములు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏఈలు వెంకటేష్, యశ్వంత్, వి.బి.జి. రాంజీ సీఈఓ నరసింహారెడ్డి, సూపరింటెండెంట్ విజయకుమారి, కార్యదర్శులు బాలు గౌడ్, శ్రీనాథ్, వివిధ గ్రామాల సర్పంచులు బసప్ప, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.