ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే భద్రత, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, వాటిపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, తహసీల్దార్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.