మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి-ఫిర్యాదుదారులకు తక్షణమే న్యాయం జరగాలి: జిల్లా ఎస్పీ ఆదేశం
మహాదేవపూర్, మేజర్ న్యూస్, జిల్లాలో పోలీసు సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ బుధవారం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీవీ కెమెరాల పనితీరు మరియు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు మరియు ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
రిపోర్టర్: ప్రకాష్ మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా