andhrapradesh
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇళ్లపై ఈడీ దాడులు
హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో జరిగిన తీవ్ర అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు బుధవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతలను 'కామ్‌సైన్ మీడియా' (Camsign Media) అనే సంస్థకు కట్టబెట్టడంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ.1.14 కోట్లకు పైగా అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో, ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఎర్రమంజిల్, సికింద్రాబాద్, నేరేడ్‌మెట్, అల్వాల్, రంగారెడ్డి జిల్లా చెవెళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చినకాకాని ప్రాంతాల్లో ఉన్న నివాసాలలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.