ఏళ్లు మారినా.. కదలని కుర్చీలు!?
హుస్నాబాద్;ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమే. కానీ కొందరు అధికారుల విషయంలో మాత్రం ఏళ్లు గడుస్తున్నా కుర్చీలు కదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీ ఉత్తర్వులు వచ్చినా డిప్యుటేషన్ పేరుతో తిరిగి అదే కార్యాలయంలో కొనసాగుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.ఒకే కార్యాలయంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న అధికారుల వల్ల పరిపాలనలో కొత్తదనం కొరవడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దస్థాయి అధికారులు అయినా.. చిన్నస్థాయి సిబ్బంది అయినా.. “మా కుర్చీ మాకే” అన్నట్టుగా వ్యవహారం సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బదిలీ అయినా.. మళ్లీ డిప్యుటేషన్ ఎందుకు?:ఒక అధికారి బదిలీ కావాల్సిన సమయం వచ్చినా అదే ప్రాంతంలో కొనసాగేందుకు మార్గాలు వెతుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీ ఉత్తర్వులు అమలులోకి వచ్చిన తర్వాత కూడా డిప్యుటేషన్, అదనపు బాధ్యతలు, ఇతర పరిపాలనా కారణాల పేరుతో అదే స్థానంలో కొనసాగడం వెనుక అసలు కారణమేంటి? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.సిఫారసుల బలమా.. ఉన్నతాధికారుల అండా?:అధికారులను మార్చాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వారు ఏళ్ల తరబడి కొనసాగడానికి సిఫారసులు, రాజకీయ పలుకుబడి లేదా ఉన్నతాధికారుల అండదండలే కారణమనే మాటలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? ఎవరి ఒత్తిడి పనిచేస్తోంది? బదిలీ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా? అనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పవలసిన పరిస్థితి నెలకొంది. ఒకే అధికారి... ఏళ్ల తరబడి అదే కుర్చీ!: అధికారి మారితే పనితీరులో మార్పు వస్తుందని ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తారు కానీ సంవత్సరాల తరబడి ఒకే వ్యక్తి ఒకే స్థానంలో కొనసాగితే ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం ఫైళ్ళ కదలికలో ఆలస్యం కార్యాలయ వ్యవహారాల్లో నిర్లక్ష్యం పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల బదిలీలు కాగితాలకే పరిమితమా? :డిప్యూటేషన్ పేరుతో పాత కుర్చీలోకి ఎందుకు తిరిగి వస్తున్నారు? నిబంధనలు అందరికీ ఒకేలా అమలు చేస్తున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు?.