telangana
ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..?
మేడ్చల్, మేజర్ న్యూస్: ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు అమల్లోకి తెచ్చిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఎల్లంపేట మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సమాచారం అందించాల్సిన అధికారులే దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే అంశంపై మూడుసార్లు దరఖాస్తు చేసినా కోరిన సమాచారం అందకపోవడంతో మున్సిపల్ అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అడిగిన సమాచారానికి బదులుగా సంబంధం లేని వివరాలు అందిస్తూ కాలయాపన చేస్తున్నారని ఓ దరఖాస్తుదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తనకు అవసరమైన నిర్దిష్ట సమాచారాన్ని పొందేందుకు సమాచార హక్కు చట్టం కింద వరుసగా మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు బాధితుడు తెలిపారు. అయితే ప్రతిసారీ తాను కోరిన అసలు సమాచారాన్ని అందించకుండా ఇతర వివరాలతో సరిపెడుతున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా సమాచారం కోరిన పౌరుడికి నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరిస్తున్నారని విమర్శించారు. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.కోరిన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, ఒక కాగితం ఖర్చు తప్ప మీకేం నష్టం జరుగుతుందని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు బాధితుడు ఆరోపించారు. ప్రజలకు చట్టం కల్పించిన హక్కును గౌరవించాల్సిన అధికారులే ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమాచారం కోరడం పౌరుడి హక్కు కాగా, దానిని అందించడం సంబంధిత అధికారుల చట్టబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు.మరోవైపు సమాచారం ఇవ్వకపోవడంపై ప్రశ్నించినప్పుడు ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానాలు ఇస్తున్నారని బాధితుడు ఆరోపించారు. సంబంధిత సమాచారం తమ వద్ద లేదని ఒకసారి, పై అధికారులు సమాచారం ఇవ్వడానికి అనుకూలంగా లేరని చెప్పమన్నారని మరోసారి సమాధానమిస్తున్నట్లు తెలిపారు. సమాచారం తమ కార్యాలయ పరిధిలో లేకపోతే సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత ప్రజా అధికార సంస్థకు దరఖాస్తును బదిలీ చేయాల్సి ఉంటుందని, సమాచారం నిరాకరించాల్సి వస్తే అందుకు చట్టబద్ధమైన కారణాలను తెలియజేయాలని పేర్కొన్నారు. అంతేకానీ పై అధికారుల పేరుతో తప్పించుకోవడం, పదేపదే కొత్త దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. తాను సమర్పించిన మూడు ఆర్టీఐ దరఖాస్తులు, వాటికి అధికారులు ఇచ్చిన సమాధానాలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కోరిన సమాచారాన్ని చట్ట ప్రకారం అందించడంతో పాటు నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతకు కీలకమైన సమాచార హక్కు చట్టం అమలులోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్య ప్రజలు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలని బాధితుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎల్లంపేట మున్సిపాలిటీలో ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ ఆరోపణలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.