ఏఐజీ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు అదృశ్యం బీహార్‌కు వెళ్తున్నానని తండ్రికి ఫోన్.. ఆ తర్వాత కనిపించని యువకుడు
రాయదుర్గం,మేజర్ న్యూస్ : అక్టోబర్ 26: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడు అదృశ్యమయ్యాడు. బీహార్‌లోని పాట్నాకు చెందిన తనీష్ కుమార్ సింగ్ (22) జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. మాజీ సైనికుడు కమలేశ్ కుమార్ సింగ్ కుమారుడైన తనీష్ ఈ ఏడాది జూలై 15న హైదరాబాద్‌కు వచ్చాడు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో అజైల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా చేరి, ఆస్పత్రి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 8న ఉదయం 8 గంటల సమయంలో తన స్వస్థలమైన పాట్నాకు వెళ్లేందుకు లగేజీ, రెండు సెల్‌ఫోన్లతో హాస్టల్ నుంచి బయలుదేరాడు. బయలుదేరే ముందు తండ్రికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అయితే, అతడు స్వగ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడి కోసం తండ్రి బీహార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైంది.తనీష్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌లో లేదా సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.