నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’
రైతులకు భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, ప్రకృతి వ్యవసాయం, జీవ ఎరువుల వాడకాన్ని పెంచాలని అధికారులు సూచించారు.
రైతులు పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువుల వినియోగంతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ నాయక్, పీఏసీఎస్ సీఈఓ కొత్త రవీందర్ రావు, ఆత్మ చైర్మన్ కట్టా అనంతరెడ్డి, గ్రామ సర్పంచ్ చింతగుళ్ల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ అంతటి శైలజ, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గణేష్ గౌడ్ , ఉప్పునుంతల సూర్య ప్రతినిధి