By సూర్య ప్రతినిధి
Updated : 27 Oct 2026 12:29 IST
Select Suryaa Now
అమరావతి: దేశంలోకి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోందని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కూటమి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సవాళ్లు, క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలకు కేటాయించిన నిధులను సైతం మళ్లించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.లక్షన్నర కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని, నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు, హంద్రీనీవా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేశామని వివరించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కిందిస్థాయి ప్రజల వరకు చేరాలంటే కూటమి నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. అందరూ సమన్వయంతో, ఐక్యతతో ముందుకెళ్తేనే విజయం సాధ్యమవుతుందని సూచించారు.