ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్ శ్రీరాములు
సూర్య - పెద్దపల్లి : ఖరీఫ్ 2026 ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రతిపాదించిన 311 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకం యంత్రాలు, తేమ శాతం పరిశీలించే పరికరాలు, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.69 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. సన్న ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తుందని పేర్కొన్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదులు అందించి, రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.