దామరచెడు భవాని మాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ
బషీరాబాద్,మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని దామరచెడు భవాని మాత ఆలయంలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు వేపమండలతో అలంకరించిన బోనాలపై దీపాలు వెలిగించి, తలపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పట్టుచీరలు ధరించిన చిన్నారులు, యువతులు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని గ్రామస్తులు భవాని మాతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.