telangana
బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి
హైదరాబాద్/బాచుపల్లి, నవంబర్ 24: హైదరాబాద్ శివారు బాచుపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. బాచుపల్లి పరిధిలోని ఓ భవనం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఊపిరాడక పోవడం వల్లే ముగ్గురూ మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన బాచుపల్లి పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.