దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి
పుట్లూరు, మేజర్ న్యూస్: మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించి వారితో సమావేశమయ్యేందుకు పుట్లూరు మండలానికి వచ్చిన సింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు పాల్పడుతూ రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తుంటే వారిని నియంత్రించాల్సిన పోలీసులు, ప్రజా నాయకులుగా తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని శైలజానాథ్ ప్రశ్నించారు. ప్రజలను కలవడానికి, కార్యకర్తలతో మాట్లాడడానికి కూడా అనుమతించకపోవడం ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని ఆయన ఆక్షేపించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పుట్లూరు మండలంతో పాటు సింగనమల నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలోనూ పలువురు అడ్డంకులు సృష్టించారని, అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా పనులు పూర్తి చేసి అభివృద్ధి చేసి చూపించానని పేర్కొన్నారు. పుట్లూరు మండలంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, మండల ప్రజలకు తన గురించి, తాను చేసిన అభివృద్ధి గురించి తెలుసని అన్నారు. తాను మండలానికి వస్తే టీడీపీ నాయకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామాలకు, మండలాలకు వెళ్లకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని పర్యటనలను అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం ప్రతి రాజకీయ నాయకుడి హక్కు అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండదని, ప్రజల ఆదరణతో రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డా. సాకే శైలజానాథ్ అంటే సింగనమల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని, ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. తనను భయపెట్టాలని, రాజకీయంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అలాంటి చర్యల వల్ల అడ్డుకునే వారికే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్ స్పష్టం చేశారు.