కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *నిధుల వినియోగం, పనుల పురోగతి, పనితీరు సూచికల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలి* *సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, నవంబర్ 24: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, నిధుల వినియోగం, పనుల పురోగతి, పనితీరు సూచికలు (KPIs), నిర్దేశిత లక్ష్యాల సాధనపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మంజూరైన నిధులను సకాలంలో వినియోగించి, డిసెంబర్ 7వ తేదీలోగా ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కేవలం పనులు చేపట్టినట్లు నివేదించడం కాకుండా, వ్యయానికి సంబంధించిన బిల్లులు కూడా సమర్పించాలని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం పోషణ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తదితర పథకాల కింద నిధుల వినియోగం, పెండింగ్ పనులు, చెల్లింపుల పురోగతిని వేగవంతం చేయాలన్నారు. నిధుల వినియోగం తక్కువగా ఉన్న పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి, పది రోజుల అనంతరం మరోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు జిల్లాకు కేటాయించిన 120 యూనిట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 61 యూనిట్ల పురోగతి నమోదైందని, డిసెంబర్ 30వ తేదీ నాటికి కనీసం 75 యూనిట్ల స్థాయికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిలో ఇప్పటివరకు 74 శాతం పురోగతి నమోదైన నేపథ్యంలో, పెండింగ్లో ఉన్న ఐదు ప్రధాన ఖనిజ లీజులకు అవసరమైన అనుమతులు పూర్తి చేసి వచ్చే నెలలోగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్, మత్స్యశాఖ, హార్టికల్చర్ తదితర శాఖలు తమ లక్ష్యాల సాధనకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణంలో మిగిలిన 13.27 కిలోమీటర్ల పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి A+ గ్రేడ్ సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను వేగవంతం చేయాలని, పెండింగ్ పనులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి చెత్త–పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను పటిష్టంగా అమలు చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. అందుబాటులో ఉన్న ఈ-ఆటోలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఎన్సీడీ స్క్రీనింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని, హైపర్టెన్షన్, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గృహ నిర్మాణ పథకాల కింద పెండింగ్ చెల్లింపులను పరిష్కరిస్తూ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో అన్ని శాఖలు పనితీరు సూచికలు (KPIs), నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా సాధించేలా సమన్వయంతో పనిచేయాలని, వెనుకబడిన సూచికలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగుదలకు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో స్పష్టమైన ఫలితాలు సాధించాలని, రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ఆదాయ వసూళ్లు, జీఎస్టీ లక్ష్యాల సాధన, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై నిరంతర సమీక్ష నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెంపొందించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో సి. పీ.వో భారతి, డిఎంహెచ్వో డాక్టర్ కామేశ్వర ప్రసాద్, ఆర్.అండ్.బి ఎస్.ఈ మహేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.