పదవులు కొనుక్కునేందుకు ముష్టి వేయండి
నగరి టిడిపి సీనియర్ నాయకుడు చలపతి వినతి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: నగరి ఎమ్మెల్యే టిడిపికి చెందిన కీలక పదవులు అమ్ముకుంటున్నారని, వాటిని కొనుక్కోవడానికి కోట్లాది రూపాయలుగా ముష్టి వేయాలని నగరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రామానుజం చలపతి, మాజీ కౌన్సిలర్ లత కోరారు. ఈ మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి టిడిపి ఆశయాలకు, పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఆలోచనలకు భిన్నంగా ప్రతి విషయానికి తమ నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ నాయుడు డబ్బుతో ముడి పెట్టడం, ఇసుక, గ్రావెల్, కంకర, రేషన్ బియ్యం, కలప, సారాయి, మద్యం గంజాయి, ఎర్రచందనం తదితర ప్రకృతి సంపదలను అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను గడిస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా పోరంబోకు భూములు, కొండలు, గుట్టలను సైతం అమ్ముకోవడం బాధాకరమన్నారు. నగరి మున్సిపల్ చైర్మన్ పదవిని టిడిపి కౌన్సిలర్ కు రూ 4 కోట్లకు, వైస్ చైర్మన్ పదవిని వైసీపీ నుంచి వలస వచ్చి టిడిపి కౌన్సిలర్ గా గెలుపొందిన వారికి రూ 2 కోట్లకు అమ్ముకోవడం ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయానికి ప్రత్యక్ష నిదర్శమని ఆరోపించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి జెండాలు మోసిన తమ దగ్గర ఎమ్మెల్యేకు ఇచ్చేంత ధనం లేదని, ఎవరైనా బిక్షం వేయాలని వినూత్నంగా భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నా ఆరోపణలపై నగర శాసనసభ్యులు కాణిపాకం వినాయకుని సన్నిధిలో సత్య ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకుంటారా అంటూ సవాలు విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి నగిరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై చర్యలు తీసుకొని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చలపతి కోరారు. ఈ సమావేశంలో నగరి నియోజకవర్గ టిడిపి మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.