telangana
భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి
హైదరాబాద్/మొయినాబాద్, నవంబర్ 24: సరదాగా గడిపేందుకు వెళ్లిన స్కూల్ పిక్నిక్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. స్కూల్ యాజమాన్యం, పార్క్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా పదేళ్ల బాలుడు దుర్మరణం పాలైన విషాద ఘటన హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన 'హ్యాపీ స్కాలర్స్ స్కూల్' విద్యార్థులను యాజమాన్యం శనివారం మొయినాబాద్‌లోని 'లోటస్ పాండ్ పార్క్'కు పిక్నిక్కు తీసుకెళ్లింది. అక్కడ ఆడుకుంటున్న క్రమంలో పార్క్‌లో ఉన్న ఓ భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది విద్యార్థులు కూర్చోగా, మరో నలుగురు విద్యార్థులు వెనుక వైపు నిలబడి దానిని వేగంగా ఊపుతున్నారు. ఈ క్రమంలో అభిరామ్ (10) అనే బాలుడు అదుపుతప్పడంతో, అత్యంత వేగంగా వెనక్కి వచ్చిన భారీ ఇనుప ఊయల బాలుడి నుదురు, ఛాతీ భాగాల్లో బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిరామ్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోగా, పక్కనే ఉన్న యశ్వంత్ అనే మరో విద్యార్థికి గాయాలయ్యాయి. అంత భారీ ఊయల వద్ద చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో, దాని వేగాన్ని అంచనా వేయలేని పసిపిల్లల వద్ద కనీసం ఒక్క ఉపాధ్యాయుడు గానీ, స్కూల్ సిబ్బంది గానీ లేకపోవడమే ఈ ఘోరానికి దారితీసిందని ప్రత్యక్ష సాక్షులైన విద్యార్థులు తెలిపారు.
తల్లిదండ్రుల ఆందోళన.. పోలీసుల కేసు నమోదు: స్కూల్ యాజమాన్యం, పార్క్ నిర్వాహకుల తీవ్ర నిర్లక్ష్యం, సరైన భద్రతా పర్యవేక్షణ లేకపోవడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ మృతుడు అభిరామ్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. యాజమాన్యాన్ని నమ్మి పిల్లలను పిక్నిక్కు పంపిస్తే ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా అంటూ ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ విషాద ఘటన బయటకు పొక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న మొయినాబాద్ పోలీసులు.. నిర్లక్ష్యంతో మృతికి కారణమైనట్లు, ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడినట్లు సంబంధిత బాధ్యులపై సెక్షన్లు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.