సూర్య జైనూర్: జైనూర్ మండలం రాసిమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలను జర్మనీ దేశానికి చెందిన మిస్టర్ రైఫ్ హెల్మాన్, డాక్టర్ నోరెబెర్ట్, డోరోతీ, ఆగ్నేష్, జోసెఫ్ వాచ్, ఆమో, జీన్స్ క్రోమ్మింగా, మిస్టర్ శ్రీరంగరాజన్ తదితరులు సందర్శించారు. చేతన్ గుడ్ టెక్స్‌టైల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి పాఠశాల విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థినులు తమ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించేలా గిరిజన నృత్యాలను ప్రదర్శించారు. విద్యార్థినులతో కలిసి విదేశీ అతిథులు కూడా ఉత్సాహంగా నృత్యం చేయడంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. తమ సంప్రదాయ నృత్యంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విదేశీ అతిథులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సరమేడి దుందిరావు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలను విదేశీ అతిథులు సందర్శించడం అభినందనీయమని, ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తిరుపతి, హెచ్‌ఎం అనిత, సీఐ రమేష్, డాక్టర్ అశోక్, సరమేడి దుందిరావు, సర్పంచ్ ఉయిక చందు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.