ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు, కలెక్టరేట్ నవంబర్ 24: నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆన్‌లైన్ రాండమైజేషన్ విధానం ద్వారా ఎన్నికల సిబ్బందిని కేటాయించారు.
మున్సిపల్ ఎన్నికల పరిధిలో కావలి, గూడూరు మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీకి సంబంధించి మొత్తం 217 పోలింగ్ కేంద్రాలకు 1,302 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఇందులో కావలికి 546 మంది, గూడూరుకు 594 మంది, అల్లూరుకు 162 మంది సిబ్బంది ఉన్నారు. అదనంగా రిజర్వ్ సిబ్బందిని కూడా కేటాయించారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావలిలో 12, అల్లూరులో 9, గూడూరులో 22 మంది చొప్పున మొత్తం 43 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించగా, 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 51 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు.
అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా కొండాపురం, జలదంకి, కావలి, బోగోలు, కలిగిరి, వింజమూరు, దగదర్తి, అల్లూరు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని కేటాయించారు. ఈ ఎనిమిది మండలాల పరిధిలో మొత్తం 1,352 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఏకగ్రీవమైన 182 కేంద్రాలను మినహాయించి 1,170 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులతో కలిపి మొత్తం 2,915 మంది సిబ్బందిని కేటాయించారు. అదనంగా 345 మంది రిజర్వ్ సిబ్బందిని సిద్ధం చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని 148 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించగా, 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 176 మందిని కేటాయించారు.
ఎన్నికల విధుల కేటాయింపులో పారదర్శకత, నిష్పక్షపాత విధానాలను పాటిస్తూ ఆన్‌లైన్ రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, డీఈవో బాలాజీ రావు, సిపిఓ లక్ష్మీనరసింహం తదితరులు ఉన్నారు.