చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్
కీసర, మేజర్ న్యూస్ : బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, పొదుపు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కీసర దయారా బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం కీసరలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. నాబార్డ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు బ్యాంకులు అందించే వివిధ సేవలు, పొదుపు వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాలపై కళాజాత బృందం వినూత్న ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించింది. ముఖ్యంగా ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మ్యాజిక్ ప్రదర్శన ద్వారా వివరించారు. బ్యాంకు ఖాతాల భద్రత, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సందర్భంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) శివప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజలకు ఆర్థిక భద్రతతో పాటు భరోసా కల్పిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సూచించారు. చిన్నతనం నుంచే డబ్బు పొదుపు చేసే అలవాటును పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఆర్. ఉదయ్ కిరణ్, హైదరాబాద్-2 రీజినల్ ఆఫీస్ సీనియర్ మేనేజర్ (ఆపరేషన్స్) సత్యకిరణ్, బ్రాంచి మేనేజర్ సాయి రామారావు, అకౌంటెంట్ శ్రీధర్‌తో పాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.