అద్దంకి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్.
సూర్య న్యూస్ అద్దంకి.:జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అద్దంకిలో పర్యటించి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటరు కూడా ఇక్కడే ఉండడంతో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ గదిలోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు వేరువేరుగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బందిని కూడా మోహరిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ గదిలో సీసీటీవీల ద్వారా లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. దీనిని జిల్లాస్థాయి యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఓటర్లందరూ తమ హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డి.ఎస్.పి బాల మురళీకృష్ణ, మునిసిపల్ కమిషనర్ రవీంద్ర, తహసిల్దార్ శ్రీ చరణ్, ఇతర అధికారులు ఉన్నారు.